తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ట్రోఫీని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ట్రోఫీలో హీరో అక్కినేని అఖిల్, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ట్రోఫీలో 258 జట్లు, 4వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మరోవైపు సిద్దిపేట క్రికెట్ స్టేడియం యువకులతో కిక్కిరిసి పోయింది.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సిద్దిపేట స్టేడియంలో ఆడిన ఇద్దరు క్రీడాకారులు ఆఫ్రిది, అబ్రహర్ ఇప్పుడు రంజీ క్రీడల్లో ఆడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆత్మవిశ్వాసానికి ప్రతీక, ఆయనను క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పోరాడి తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించారు.
అసెంబ్లీలో శపథం పూని రెండేళ్లలో ఇంటింటికీ తాగునీరు అందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును దేశానికే ఆదర్శంగా మూడేండ్లలో పూర్తి చేశారు.
క్రీడాకారులు సీఎం కేసీఆర్‌ను రోల్ మోడల్‌గా తీసుకొని ఆల్ రౌండర్లుగా రాణించాలి. క్రీడలు మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తాయి. సిద్దిపేట.. స్పోర్ట్స్ హబ్, వాటర్ హబ్, అల్ రౌండర్‌గా అభివృద్ధి చెందుతోంది. చాముండీ.. టీ-20 జూనియర్ ట్రోఫీ సిద్దిపేటలో నిర్వహిస్తామని చెప్పడం సంతోషకరం. టీ-20 తరపున అక్కినేని అఖిల్ అడతానని చెప్పడం సంతోషకరమైన విషయం.. అని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు, హీరో అఖిల్ కాసేపు స్టేడియంలో క్రికెట్ ఆడి సరదాగా గడిపారు.