గుడి లేదు.. గోపురం లేదు.. అష్టోత్తరాలు, సహస్రనామాలు ఏమీ లేవు.. సమ్మక్కా అని నోరారా పిలిస్తే.. సక్కగ జూస్తది. సారలమ్మా అని మనసారా కొలిస్తే.. అమ్మగా దీవిస్తది. నిలువెత్తు బెల్లం సమర్పిస్తే.. తల్లీకూతుళ్లిద్దరూ బతుకంతా కొంగు బంగారమై కాపాడుతరు. జీవితాన్ని పావనం చేసే వన దేవతల రెండేండ్ల సంబురం మొదలైంది. గద్దెనెక్కి భక్తుల బతుకులను దిద్దే జనజాతరకు జయజయ ధ్వానాలు పలుకుదాం.
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం.. సమ్మక్క-సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది.
మాఘ పౌర్ణమి నాడు (సమ్మక్కల పున్నం) జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల ప్రధాన జాతర అంతా గిరిజన సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు. పూనకాలే హోమాది క్రతువులు. నమ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆ సాహసాన్ని తలుచుకొని భక్తి పారవశ్యం చెందడమే మానవత్వం. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది.
సమ్మక్క- సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలూ ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటి మధ్య ఉండే చెట్టు మానులనే దేవతా మూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు భక్తులు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం.
పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే అర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లసిందేవమ్మ మొకు (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొకులు ఇకడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. దానిని ధరిస్తే సకల రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
సమ్మక-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వన దేవతలకు నిలువెత్త్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. ఇక్కడ ఇదే ప్రసాదం. అశేష జనవాహిని వచ్చే ప్రాంతంలో దుమ్మూధూళితో ఆరోగ్య సమస్యలు రాకుండా బెల్లం అడ్డుకుంటుదని చెబుతారు.
అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ జాతరకు మహిళలు రావచ్చు. అంటు, ముట్టు అనే పదాలు ఇకడ చెల్లవు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేల సంఖ్యలో ఉంటారు.
అసలు జాతరకు రెండువారాల ముందునుంచే మేడారంలో సంబురాలు మొదలు అవుతాయి. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మలకు గుళ్లుగా గుడిసెలు ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడం (గుడి మెలిగె)తో రెండు వారాల ముందు జాతర ప్రక్రియ మొదలవుతుంది. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి (మండ మెలిగె) అలంకరిస్తారు. అమ్మవారి వారంగా బుధవారాల్లోనే ఇవి జరుగుతాయి.