స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంతకాలం డీసెంట్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఆమె కూడా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. ఇందుకు కారణం వరుస ఫ్లాపులతో కాస్త రేసులో వెనకబడుతుండటమేనని టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా కీర్తి నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. ‘మహానటి’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ, క్రేజ్ వచ్చేసింది. దాంతో ఎడాపెడా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు కమిటయ్యారు.
వీటిలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కూడా ఉన్నాయి. ‘మహానటి’ లాంటి భారీ హిట్ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన ‘సామి స్క్వేర్’ – విశాల్ సరసన ‘పందెం కోడి 2’ చేశారు. ఈ రెండు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి.ఆ తర్వాత ద్విభాషా చిత్రాలుగా ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ చిత్రాలు వచ్చాయి. అవి కూడా ఫ్లాప్ సినిమాలుగానే మిగిలాయి. నితిన్ సరసన చేసిన ‘రంగ్ దే’ ఓ మాదిరి హిట్ సాధించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అణ్ణాత్త’లో ఆయనకు చెల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇక ఇటీవల వచ్చిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘గుడ్ లక్ సఖి’ కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరిపోయింది. ఇలా కీర్తి నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవడం..అదే సమయంలో పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి గ్లామర్ హీరోయిన్స్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్స్‌గా మారడంతో కీర్తి బాగా వెనకబడింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా మీదే ఉన్నాయి. అందుకే, ఇక గ్లామర్ డోస్ పెంచేసి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారట. మరి కీర్తి ఆశించిన సక్సెస్ మహేశ్ మూవీతో దక్కుతుందో లేదో చూడాలి.