అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సుమారు 5 వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే లక్షలాది మందితో ఢిల్లీలో ధర్నా చేస్తామన్నారు. 1200 మంది అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారు.
తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోం అన్నారు.మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మోదీకి ఇక్కడి అభివృద్ధి కనిపించలేదా? కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా అభివృద్ధిలో ముందుంది అని మంత్రి తెలిపారు.అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి తెలంగాణ మీద విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అంత సీఎం కేసీఆర్ వెంట ఉంది కాబట్టే చూసి ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు.