బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్ధాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారని, ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దామని, మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధమని నడ్డాకు సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయని చురకలంటించారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర మంత్రులే ప్రశంసించారని చెప్పారు. నడ్డాకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అడ్డగోలు ఆరోపణలు చేశారన్నారు. ఆ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు.
బుధవారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… రాష్ట్రానికి వచ్చి ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేసిన నడ్డా.. ఇంట గెలిచి రచ్చ గెలవాలని సూచించారు. నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పారు. ఆ పార్టీ నాయకులు మతి కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, అరవింద్‌పై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి బీజేపీ లీడర్లు ఎవరొచ్చినా గల్లీ లీడర్లు రాసిచ్చింది చదువుతున్నారని విమర్శించారు.
బిడ్డా నడ్డా.. తెలంగాణలో నీ నక్రాలు నడవవని హెచ్చరించారు. తెలంగాణ లో నిన్ను నమెందుకు బక్రాలు ఎవ్వరూ లేరని చెప్పారు. మిషన్ భగీరథ, కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పిన నడ్డా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నేతలు ఎక్కుడున్నారని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి.. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఏ టూ జడ్ స్కాములు చేశారని ఆరోపించారు. బీజేపీ అంటేనే స్కాముల పార్టీ అని, ఏ టూ జెడ్ స్కాములు చేశారన్నారు. ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం వరకు అన్ని రకాల స్కాములకు పాల్పడ్డారననారు. కాంగ్రెస్ కూడా వివిధ కుంభకోణాలకు పాల్పడిందన్నారు. మిషన్ భగీరథపై మాట్లాడిన తీరుపై సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీని తిడతారు, గాడ్సేను కొలుస్తారన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయాలంటే పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.