రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో పాఠశాలలను ఆదివారం వరకు మూసివేయాల్సిందిగా ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఆదేశించారు. బుధవారం ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని పేర్కొన్నారు.
పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో పంట తగులబెట్టడం, నిర్మాణాల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు నేపథ్యంలో బుధవారం జాతీయ రాజధానిలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు నిన్ననే ప్రకటించారు. ఆ ఆదేశాలను మరికొన్ని రోజులు పొడిగించారు.
18 వాహనాలు ఢీ
మరోవైపు దిల్లీలో అలముకున్న దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం ఆగ్రా-నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కారణంగా దాదాపు 18 కార్లు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీలో పగటి వేళ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. బుధవారం 14 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.