తెలంగాణ రాష్ర్టానికి మరో భారీ పెట్టుబడి ఖాయమైంది. జర్మనీకి చెందిన వాహన పనిముట్ల తయారీ సంస్థ లైట్‌ఆటో జీఎంబీహెచ్ రాష్ట్రంలో 180 నుంచి 200 మిలియన్ యూరోల (దాదాపు రూ.1,500 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. జహీరాబాద్‌లో వంద ఎకరాల స్థలంలో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి లభించనున్నది.
హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ.. లైట్ ఆటో సంస్థ వంద ఎకరాల స్థలం కావాలని కోరిన పదిరోజుల్లోనే ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు.జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు ముందుకొస్తే ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రాంతమని, ఇక్కడ దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం ఉన్నదని వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూమి రెండు లక్షల ఎకరాలకు పైగా ఉన్నదని, పారిశ్రామికవేత్తలకు టీఎస్‌ఐఐసీ ద్వారా భూములు కేటాయిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలతో పాటు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నదని చెప్పారు. ఇతర రాష్ర్టాల కంటే మెరుగైన ప్యాకేజీలు వర్తింపజేస్తామని అభయమిచ్చారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని వివరించారు. హైదరాబాద్‌కు ఉన్న సానుకూలతలపై విడమరిచి చెప్పారు.