పల్లెప్రగతి పనుల పురోగతి గ్రామస్థాయిలో పరిశీలించేందుకు మండల, జిల్లా స్థాయి అధికారుల తనిఖీకి ప్రత్యేకంగా ఇన్‌స్పెక్షన్ యాప్‌ను రూపొందించారు.తనిఖీల్లో మరింత పారదర్శకత కోసం ప్రతి గ్రామానికి ఆక్షాంశాలు, రేఖాంశాలను నమోదు చేశారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాల పరిధిలోకి వెళ్తేనే యాప్‌లో ఆ గ్రామం పేరు ఓపెన్ అవుతుంది. దీంతో ఆ గ్రామాలకు వెళ్లకున్నా వెళ్లినట్టుగా నివేదికలు ఇచ్చేందుకు ఎలాంటి అవకాశం ఉండదు.
ఇప్పటివరకు నాలుగు విడతలుగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెలా పెద్దఎత్తున నిధులను విడుదల చేస్తున్నారు. చేపట్టిన పనుల పురోగతి, నాణ్యత పరిశీలించడం, అవసరమైతే వేగిరపర్చడం, స్థానికంగా ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఈ తనిఖీలు ఎంతగానో ఉపయోగపడుతాయి.
అధికారులకు వాస్తవ పరిస్థితులు, గ్రామస్థాయి పరిస్థితులు తెలుస్తాయి. జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ప్రతినెలా ఐదు గ్రామాలు, డివిజనల్ పంచాయతీ అధికారి(డీఎల్‌పీవో) పది గ్రామాలు, ఎంపీడీవో, ఎంపీవోలు 16 గ్రామాలు, జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో ఐదు గ్రామాలను నెలరోజుల్లో తనిఖీ జరిపి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తున్నారు.
కొన్ని చిన్న మండలాల్లో పది వరకు పంచాయతీలు ఉండటంతో కొన్ని గ్రామాలను ఒక నెలలో రెండుసార్లు కూడా తనిఖీ చేస్తున్నారు. వారి పర్యటనలపై ఎలాంటి అనుమానాలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతో అక్షాంశ-రేఖాంశాల యాప్‌కు శ్రీకారం చుట్టారు. గతనెల ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సాంకేతికంగా ఎదురైన ఇబ్బందులను సరిచేసి ఈ నెల నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు.