తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశమయ్యారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
ఆర్టీసీపై డీజిల్ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను కోరారు. ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశముందని అధికారులు అంటున్నారు. కేంద్రం డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించడంతో.. రోజుకు 65 లక్షల రూపాయలు ఆదా అవుతోంది. దీంతో ఆర్టీసీకి కొంత ఉపశమనం లభించినా.. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెంపుపై 3, 4 ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, వాటిపై ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించి… తదుపరి సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంపైనా తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.