బీజేపీ ప్రాథమిక సభ్యత్వం వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ తెలిపారు. చాలా కాలంగాపార్టీ తనను నిర్లక్ష్యం చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. బీజేపీతో తన అనుబంధాన్ని వదులుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసానని తెలిపారు.
బీజేపీ నుంచి వైదొలగాలనే నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజానీకం కోసం తాను పోరాడాలనుకుంటున్నానని, బీజేపీలో కొనసాగుతూ ఆ పని చేయడం సాధ్యం కాదని చెప్పారు.
బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ నుంచి తనను తొలగించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర నాయకత్వం తన భద్రతను కూడా ఉపసంహరించిందని, తానేమీ పార్టీకి కొత్త కాదని, 2014లోనే తాను ఆ పార్టీలో చేరానని చెప్పారు. సంస్థ కోసం మరింత పని చేయాలనుకుంటున్నట్టు 2017లోనే తాను నరేంద్ర మోదీకి చెప్పానని, కానీ స్పందన లేదని అన్నారు. ఇప్పటికీ తనను నిర్లక్ష్యం చేస్తుంటే సహించలేనని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు ఇంతవరకూ అయితే అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని జాయ్ బెనర్జీ సమాధానమిచ్చారు.