ఆల్కాహాల్ సేవించి వాహనం నడపడం ప్రమాదకరం.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఎవరైనా మద్యపానం చేయరాదు.. అయితే, అనునిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదే మద్యం మత్తులో ఉంటే మరింత స్పీడ్‌గా వెళుతుంటారు.. అటువంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.. దీన్ని నివారించడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట వాహన చోదకులను నిలిపి వారు మద్యం సేవించారా.. లేదా.. అన్నది బ్రీత్ ఎనలైజర్ ద్వారా చెక్ చేస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్‌పై ఇలా మార్గదర్శకాలు
మద్యం సేవించి వాహనం డ్రైవింగ్ చేయడం నేరం.. ఒకవేళ మద్యం సేవించి ఉంటే.. వారిని అరెస్ట్ చేయొచ్చు.. కానీ, వారి వాహనాన్ని సీజ్ చేయొద్దని రాష్ట్ర హైకోర్టు.. పోలీసులను ఆదేశించింది. ఈ విషయమై దాఖలైన 40 రిట్ పిటిషన్లపై విచారణ పూర్తి చేస్తూ జస్టిస్ కే ఎల్ లక్ష్మణ్ సారధ్యంలోని రాష్ట్ర హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
బంధువు.. స్నేహితుడికి సమాచారం ఇవ్వాలి..
మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడుపుతూ ఉంటే, ఆయనతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేసేందుకు పోలీసులు అనుమతించాలి.. లేదా వారి బంధువుకు గానీ, స్నేహితుడికి గానీ సమాచారం ఇచ్చి సదరు వాహనం తీసుకెళ్లమని సూచించాలని హైకోర్టు పేర్కొంది. ఈ మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం లేనప్పుడు మాత్రమే పోలీసులు సంబంధిత వాహనాన్ని తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించింది. అలా జప్తు చేసిన వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సమర్పించిన దాని యజమాని, లేదా అధీకృత వ్యక్తికి తదుపరి దాన్ని అప్పగించాల్సి ఉంటుంది.
3 రోజుల్లో చార్జిషీట్‌తో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి
ఇక మద్యం సేవిస్తూ వాహనం డ్రైవ్ చేసిన వ్యక్తిని పోలీసులు మూడు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని పోలీసులను హెచ్చరించింది. మోటార్ వెహికల్స్ యాక్ట్‌లో గానీ, ఇతర ప్రభుత్వ ఆదేశాల్లో గానీ.. ఒక వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది.