టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పార్టీలోని అన్ని విభాగాలు, అన్ని సామాజికవర్గాల నేతలు కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలుచేశారు. అధ్యక్ష పదవికి ఇతరులెవ్వరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కేసీఆర్ ఎన్నిక ప్రకటన ఏకగ్రీవమైంది.
పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఇప్పటివరకు వరుసగా ఎనిమిదిసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇది 9వ సంస్థాగత ఎన్నిక. చివరిసారిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. 2019లో పార్లమెంట్ ఎన్నికలు, 2020, 2021లో కరోనా కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించలేదు.