ఈ నెల 25న హైటెక్స్ వేదికగా జరగబోయే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుంది అని కేటీఆర్ తెలిపారు. 6 వేల పైచిలుకు ప్లీనరీ ప్రతినిదులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం 35 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు ప్రజాప్రతినిధులు సహకరించాలి. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. 8 వేల వాహనాలకు సరిపోయే విధంగా పార్కింగ్ సౌకర్యం కల్పించామన్నారు.
మొదటి సెషన్లో అధ్యక్షుడి ఎంపిక
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో పార్టీ అధ్యక్ష ఎంపిక, కొన్ని తీర్మానాలు ఉంటాయి. రెండో సెషన్ 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో తీర్మానాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం 7 తీర్మానాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామ సమయం ఉంటుంది. ప్లీనరీకి హాజరయ్యే ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశామన్నారు.
గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి..
ప్లీనరీకి వచ్చే పురుష ప్రతినిధులు గులాబీ రంగు చొక్కాలు ధరించాలని, మహిళా ప్రతినిధులయితే గులాబీ రంగు చీరలు ధరించాలని ఇప్పటికే చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. పాస్లు ఇవాళ సాయంత్రం వరకు అందుతాయి. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ జడ్పీ చైర్మన్లతో పాటు పార్టీ ముఖ్యులకు నియోజకవర్గాల వారీగా సమాచారం అందుతుంది. వారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు అని కేటీఆర్ తెలిపారు.
అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణను సాధించాం
ఏప్రిల్ 27, 2001న కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చింది. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టి తెలంగాణను సాధించామన్నారు. జాతీయ రాజకీయ వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగామన్నారు. రాష్ట్ర సాధన క్రమంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతో మంది త్యాగాలు చేశారు అని కేటీఆర్ తెలిపారు.
ఇవాళ తెలంగాణ భారతదేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పక్క రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో తమ నియోజకవర్గాలను కలుపాలని కోరుతున్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని పక్క రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశంసిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.