దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వంద దాటిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు లబోదిబోమంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్‌పై పన్నులతో.. పేద ప్రజలకు ఉచిత భోజనంతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల .. కోట్లాది మందికి కోవిడ్ టీకాలను కూడా ఉచితంగా ఇవ్వగలిగినట్లు ఆయన వెల్లడించారు. వంట గ్యాస్ ధరలను కూడా ఆ పన్నులతోనే నియంత్రించగలిగినట్లు ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులను తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. మంత్రి హరిదీప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ధరలు పెరిగిన ప్రతిసారి పన్నులు తగ్గించాలని కోరడం సరికాదన్నారు.
వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను ఇచ్చామని, సుమారు 90 కోట్ల మందికి మూడు పూటల మీల్స్ అందించామని, ఉజ్వల స్కీమ్‌ను కూడా అమలు చేశామని, 8 కోట్ల మంది ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందించినట్లు మంత్రి హరిదీప్ తెలిపారు. ఇంధనపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ ద్వారా వచ్చే రూ.32తోనే ఇవన్నీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. పన్నుల నుంచి వచ్చే డబ్బుతోనే.. రోడ్లను అభివృద్ధి చేశామని, అణగారినవారికి ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇంకా ఇతర సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లీటరుపై వచ్చే రూ.32 ట్యాక్స్‌తోనే సంక్షేమ సేవలను కల్పిస్తున్నామని, ఇంకా వంద బిలియన్ల కోవిడ్ డోసులను ఇచ్చినట్లు తెలిపారు.