క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు రోజురోజుకూ సీరియ్‌సగా మారుతోంది. ఓవైపు ఆర్యన్ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు బెయిలు నిరాకరించగా.. మరోవైపు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు దూకుడు పెంచారు. గురువారం షారుక్ నివాసం ‘మన్నత్’లో సోదాలు నిర్వహించారు. బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు.
ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టా్‌పను సీజ్ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు అనన్య తన తండ్రి చుంకీ పాండేతో కలిసి ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 6.15 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు. ఆర్యన్‌తో చాటింగ్ చేసింది అనన్యేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆర్యన్ ఖాన్ బెయిలు పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ జరుపుతామని బొంబాయి హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని గురువారం ఆర్యన్ తరఫు న్యాయవాది సతీశ్ మాన్‌షిండే కోరారు. కాగా, ఆర్యన్‌సహా 8మంది జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 4 నుంచి దీపావళి పండగ సెలవులు ఉండడంతో కోర్టు కస్టడీ గడువును 9 రోజులు మాత్రమే పొడిగించింది.