తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వర్చువల్గా పాల్గొన్నారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తైవాన్ పెట్టుబడులకు ఆది నుంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా తెలంగాణ – తైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం ఉందన్నారు. తైవాన్ పెట్టుబడుల కోసం గతంలో ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తైవాన్ దేశానికి సంబంధించిన టీసీఏ (taiwan computer association) తో టెక్నాలజీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇండియన్ తైవాన్ స్టార్టప్ అలయన్స్ని ఏర్పాటు చేసుకున్న ఏకైక భారత సిటీగా హైదరాబాద్ ఉందని కేటీఆర్ అన్నారు. తైవాన్ పారిశ్రామిక సంస్కృతి నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. ఈ దిశగా అక్కడి పారిశ్రామిక వర్గాలతో మరింత భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తామని కేటీఆర్ అన్నారు. 2020వ సంవత్సరం నుంచి వ్యాపార వాణిజ్య పరిస్థితులకు కరోనా సంక్షోభం సవాళ్లను విసిరిందని, అయితే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ మరింత వేగంగా కొనసాగుతుందన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.