మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం ధారబోసారు. తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారు. ఎన్నో ఏండ్లు జైలు జీవితం గడిపారు.
ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించిన బాపూజీ.. చిన్నతనం నుంచే ఉద్యమ బాట పట్టారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్ ప్రాథమిక విద్యాభ్యాసం ఆదిలాబాద్ జిల్లాలోనే సాగింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లోని సిటీ కాలేజీలో పూర్తి చేశారు. 1930 లలో స్వాతంత్య్ర సంగ్రామంలో కాలుమోపి తెల్లవారిని ఎదిరించారు. 1942 క్విట్ ఉద్యమంలో, 1952 నాన్ ముల్కీ ఉద్యమం, 1969 లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, 1996 మలిదశ ఉద్యమం.. ఇలా ఎన్నో ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ తొలి తరం ఉద్యమకారుల్లో బాపూజీ ఒకరు. తెలంగాణకు విముక్తి కల్పించేందుకు నిజాం పాలకులను ఎదురించారు. నారాయణ పటేల్‌తో కలిసి నిజాం నవాబుపై బాంబులు విసిరారు. ఈ కుట్ర కేసులో జైలు జీవితం గడిపారు.