కోదాడ నుంచి బళ్లారి వరకు వయా జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ఉన్న జాతీయ రహదారి వెంట ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై ఉన్న విధంగా జడ్చర్ల -మహబూబ్ నగర్ హైవే పైన పచ్చదనం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.
మహబూబ్ నగర్ పట్టణ శివారులోని అప్పన్నపల్లి వద్ద జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు ఎక్కడైనా మొక్కలు చనిపోతే వెంటనే వాటి స్థానంలో వెంటనే మొక్కలను నాటాలని సూచించారు. మహబూబ్ నగర్ పట్టణంలోకి ప్రవేశించే వారికి ఆకుపచ్చని పాలమూరు స్వాగతం పలకాలని ఆయన కోరారు.
రహదారుల వెంట మొక్కలను నాటి వాటిని సంరక్షించే అంశంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.