గ్రామ పంచాయతీల ఆడిట్లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామపంచాయతీలు ఉండగా.. అధికారులు ఇప్పటివరకు 3,636 పంచాయతీల లెక్కలను ఆన్లైన్లో ఆడిట్చేసి నివేదికలను ఆయా గ్రామాలకు పంపారు. ఈ క్రమంలో 68,737 అభ్యంతరాలను నమోదు చేశారు.
మొత్తంగా ఈ ఏడాది 28 శాతం గ్రామాల ఆడిట్ పూర్తిచేసి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచారు. కేవలం 443 గ్రామాల ఆడిట్ పూర్తిచేసిన ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలువగా.. హిమాచల్ ప్రదేశ్ (236), రాజస్థాన్ (144), కర్ణాటక (106) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 10 రాష్ర్టాలు మాత్రమే ఆన్లైన్ ఆడిటింగ్ను ప్రారంభిచాయి.
మిగతా రాష్ర్టాలు ఇంకా మొదలు పెట్టలేదు. దేశంలో మొత్తం 2,55,236 గ్రామాలు ఉండగా.. ఇప్పటివరకు 4,684 గ్రామాల ఆడిటింగ్ పూర్తయింది. ఇందులో 78 శాతం తెలంగాణవే కావడం విశేషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను గ్రామ పంచాయతీలు ఎలా ఖర్చు చేస్తున్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ఆడిటింగ్ వీలుకల్పిస్తున్నది.