త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు.
బండి సంజయ్ ఎంపీగా గెలిచి లక్ష రూపాయల పనైనా చేసిండా అన్ని ప్రశ్నించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేసిన హరియాణ రైతుల తలలను బీజేపీ ప్రభుత్వం పగులకొట్టించిందన్నారు. మోదీ సర్కారు దేశంలో ఆరు లక్షల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టిందని గుర్తుచేశారు. దేశాన్ని కాపాడేది మహిళా శక్తేనని, దేశ గతిని మార్చాలంటే మహిళల పాత్రే కీలకమన్నారు.
తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉండేది?, వచ్చాక ఎలా అభివృద్ధి చెందిందో మహిళలు గుర్తించాలని కోరారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకం పెడితే మిగతా వర్గాల్లో చిచ్చుపెట్టేలా బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ భవిష్యత్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై ఉన్నదన్నారు. రాజకీయంగా 19 ఏళ్లు పెంచి పెద్దచేసిన కేసీఆర్ గొప్పోడా?, కేసీఆర్‌ను మోసం చేసిన ఈటల రాజేందర్ గొప్పోడా? ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. అభివృద్ధి చేసిన పార్టీకే ప్రజలు పట్టం కట్టాలని బాల్క సుమన్ కోరారు.