దళితబంధు తమాషా అనుకోవద్దు. పెద్ద బాధ్యత అప్పగిస్తున్న. దళితబంధు ఈ రోజు పుట్టింది కాదు. 25 ఏండ్లుగా నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, 25 ఏండ్ల క్రితం దళిత చైతన్య జ్యోతికి శ్రీకారం చుట్టిన. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అనాడే పాటలు రాసిండు. కొన్ని ప్రయత్నాలు చేశాం. ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి సంతకంతో దళితబిడ్డ, నా క్లాస్‌మేట్ దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చేశా.
అదేకాదు నా మరో మిత్రుడు, ఆంధ్రభూమి విలేకరి చారితో ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులపై అధ్యయనంచేశాం. దానిప్రకారం ప్రపంచవ్యాప్తంగా దళితుల మాదిరిగానే 165 జాతులు సామాజిక వివక్షకు, అణచివేతకు గురై ఉన్నాయి. ఆస్తులు లేక, అవకాశాల్లేక అణగారి ఉన్నరు. దేశంలో అంబేద్కర్ చేసిన పోరాటాల ఫలితంగా దళితులకు కొద్దిమేర న్యాయం జరిగింది. కొన్ని పదవుల్లో రిజర్వేషన్లు వచ్చాయి. కొందరికి ఉద్యోగాలు లభించాయి. విద్యావకాశాలు దక్కాయి. కానీ ఇప్పటికీ 95% మంది దళితులు పేదరికంలోనే ఉన్నరు.
గుండెలో బాధను అణచుకొని బతుకుతున్నరు. అందుకే తెలంగాణ ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో ఏ ఒక్క పార్టీ ఈ కార్యక్రమాన్ని అమలుచేసినా నేడు ఈ పథకాన్ని చేపట్టాల్సిన అవసరముండేది కాదు. దళితబంధు ఒక్క హుజూరాబాద్‌తో ఆగిపోదు. ఈ పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గం ఒక ప్రయోగశాల. ఈ పథకమేంది? ఉద్దేశమేంది? ఎట్ల చేస్తరు? పథకం లోతుపాతులను తెలుసుకొనేందుకే మంత్రివర్గం అంతా కదలివచ్చింది దళితబంధు పథకాన్ని సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం వేదికగా ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు..