బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తనపై చేసిన అరాచకాలను గుర్తుచేసుకొని మాజీ మావోయిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పులవేణి పోచమల్లుయాదవ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2018లో ఈటల తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు దయతో బతికి బట్టకట్టానని చెప్పారు. తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయితే పునర్జన్మ ఇచ్చింది కెప్టెన్ లక్షీకాంతారావు అని తెలిపారు.
ఆదివారం హుజూరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఎంపీ లక్ష్మీకాంతారావు సమక్షంలో ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. 1981 నుంచి మావోయిస్టుగా పనిచేసి 2002లో లొంగిపోయానని తెలిపారు.
2004లో కృష్ణాష్టమి సందర్భంగా 50 వేల మందితో వేడుకలు నిర్వహించినప్పటి నుంచి ఈటల రాజేందర్ తనను అణచివేతకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. దామోదర్‌రెడ్డిపై ఈటల గెలిచినప్పుడు.. తాను తలుచుకుంటే ఓడిపోయేవాడని కానీ, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని తాను న్యూట్రల్‌గా ఉన్నానని చెప్పారు. తనపై అనేక కేసులు పెట్టి నిత్యం అణచివేతకు గురిచేశాడని ఈటల అరాచకాలు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తంచేశారు. ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించేందుకు శాయశక్తులా కృషిచేస్తానని స్పష్టంచేశారు.