తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్‌బోర్డు చరిత్రలో ఫస్టియర్‌లో అత్యధిక ప్రవేశాలు నమోదయ్యాయి. గురువారం వరకు 1,00,424 మంది విద్యార్థులు చేరారు. గతంలో ఫస్టియర్ అడ్మిషన్లు 90 వేల మంది మార్కు దాటినా, ఎప్పుడూ లక్షకు మించలేదు. ప్రవేశాల గడువును పెంచుతూ రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2015కు ముందు ప్రతిఏటా సర్కారు కాలేజీల్లో 10 శాతం అడ్మిషన్లు తగ్గుతూ ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మహర్దశ వచ్చింది. 2015-16 విద్యాసంవత్సరంలో తెలంగాణ సర్కారు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఫీజు మాఫీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాలేజీల్లో వసతుల కల్పనకు రూ.662 కోట్లు వెచ్చించింది. దీంతో సర్కారు కాలేజీలపై విద్యార్థులకు నమ్మకం ఏర్పడింది. రెసిడెన్షియల్ కాలేజీలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హవాలోనూ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెరుగుతున్నా యి. లక్ష అడ్మిషన్లు దాటడంపై ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలోని అధ్యాపకుల బృందం గురువారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి మిఠాయిలు తినిపించింది.