స్వయం పాలనా పోరాటంలో యువత పాత్ర గొప్పది అని ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థులను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేసిన చరిత్ర రాష్ట్రంలోని ప్రతిపక్షాలది. కానీ కేసీఆర్ ఆ తొవ్వలో లేరు. 2014 నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే వారిలో సీనియర్లతో పాటు 30+ ఫార్ములాను అమలు చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చి నిలదొక్కుకోవాలంటే అంతా ఈజీ కాదు. అంగ బలం, అర్ధ బలం ఉన్న నాయకులను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారు ఎదురుకోవడం ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. కానీ అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ ప్రత్యేకత. దశాబ్దాలుగా తెలంగాణ కోసం ఎందరో కొట్లాడారు. వారు సాధించలేని తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్ దే.
వారి రాజకీయ వ్యూహాలే ఇవ్వాళ ఈటల రాజేందర్ వంటి వారికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా చేసింది. 2004 నుంచి నేటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో చాలామంది కొత్తవారికి యువతకు అవకాశాలు కల్పించింది కేసీఆరే. ప్రజల పై వారికి ఉండే విశ్వాసమే ఇవ్వాళ బాల్క సుమన్, గాదరి కిషోర్, గువ్వల బాలరాజు, నోముల భగత్, పసునూరి దయాకర్ వంటి ఇంకా అనేకమందిని చట్టసభల్లో నిలబెట్టింది.
మొన్నటి దాకా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై సవాళ్లు విసిరిన ఈటల రాజేందర్ ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఉద్యమ కారుడు అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని హేళన గా మాట్లాడటం గర్హనీయం.
సాటి ఉద్యమకారుడు, పార్టీ ఆదేశాలను శిరసావహించి హుజురాబాద్ ఇంతకాలం టీఆర్ ఎస్ (ఈటెల) గెలుపు కోసం కృషి చేసిన గెల్లు శ్రీనివాస్ ను బానిసగా అభివర్ణించడం ఈటల అహంకారానికి నిదర్శనం. ఈటల తాజా వ్యాఖ్యలతో ఉద్యమకారుల్లో ఇప్పటిదాకా తనపై ఉన్న కొద్దిపాటి సానుభూతిని కోల్పోయాడు.
ఒక నియోజకవర్గంలో పోటీ చేయడానికి అనేకమంది ఆశావహులు ఉంటారు. అందరికీ అవకాశం దక్కదు. పార్టీ ఎవరిని ఎంపిక చేస్తే వారి గెలుపు కోసమే పనిచేయాలి.
ఇవ్వాళ ఆరుసార్లు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే అందుకు కేసీఆర్ ఆయనకు ఇచ్చిన అవకాశం, ఇదే పార్టీ గెలుపు కోసం కష్టపడిన బానిస గెల్లు శ్రీనివాస్ కాదా? తనకు అవకాశం వస్తే తనకు తాను ఉద్యమకారుడుగా, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ప్రచారం చేసుకున్న ఈటల ఇవ్వాళ గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ లో పార్టీ పటిష్టత కోసం చేసిన కృషిని గుర్తింపు ఇస్తే అతనిపై బానిస ముద్ర వేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
హుజురాబాద్ లో తాను, తన కుటుంబం తప్పా ఇంకా ఎవరూ రాజకీయాలు చేయవద్దు అనే ఆధిపత్య భావజాలం ఆయన మాటల్లో ధ్వనిస్తున్నది. బడుగు బలహీన వర్గాల వ్యక్తి ఎదుగుదల ను జీర్ణించుకోలేని ఈటల కు తాను బీసీని అని చెప్పుకొనే అర్హత కోల్పోయారు. అంతేకాదు ఈటల రాజేందర్ శామీర్ పేట్ లో ఓసీ హుజురాబాద్ లో బీసీ వాదనలు వాస్తవమే అని నిన్నటి ఈటల బానిస వ్యాఖ్యలతో రుజువు అయ్యింది.
Tags gellu srinivas yadav huzurabad by elections huzurabad by poll kcr ktr slider telangana telanganacm telanganacmo trsgovernament trswp