ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం సాధారణ ప్రజలను బలి తీసుకుంటోంది.
తమ దేశం రావణకాష్టంగా మారుతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్.. తమను ఇలా గందరగోళంలో వదిలేయకండి అని ప్రపంచ నేతలను వేడుకుంటున్నాడు. బుధవారం అతడు ట్విటర్ ద్వారా తన గోడు వెల్లబోసుకున్నాడు.ప్రపంచ నేతలారా! మా దేశం గందరగోళంగా ఉంది. పిల్లలు, మహిళలు సహా వేల మంది ప్రతి రోజూ మృత్యువాత పడుతున్నారు.
ఇళ్లు, ఆస్తుల విధ్వంసం జరుగుతోంది. వేలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. మమ్మల్ని ఇలా గందరగోళంలో వదిలేయకండి. ఆఫ్ఘన్ల హత్యలను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండి. మాకు శాంతి కావాలి అని రషీద్ ఖాన్ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని 65 శాతం భూభాగం మళ్లీ తాలబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.