ఇంద్రవెల్లి సభలో సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌పై కేసులు చివరి దశలో ఉన్నాయని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో జైలుకు వెళ్లనున్న ఖ్యాతి ఆయనకే దక్కనుందన్నారు.
‘‘సోనియమ్మ రాజ్యం కావాలని రేవంత్ అంటున్నడు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా పదేళ్లపాటు నాన్చి వందల మంది చావుకు ఆమె కారణమయ్యారు. అంతమందిని బలి తీసుకున్న సోనియా రాజ్యం కావాలా?’’ అంటూ ప్రశ్నించారు. స్వయంగా రేవంత్‌రెడ్డే నాడు సోనియాను బలిదేవతన్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇంద్రవెల్లి సభ రేవంత్‌రెడ్డి నోటి తీట తీర్చిందే తప్ప దళిత, గిరిజన, ఆదివాసీలకు దాంతో ఒరిగిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల కిందట ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. చంద్రబాబు మేనేజ్‌మెంట్‌తోనే రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడయ్యాడని, పూటకో పార్టీ మార్చిన చరిత్ర ఆయనదని విమర్శించారు.
దళితబంధు పథకాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం కేసీఆరే చెప్పారని, దీని గురించి రేవంత్ చెప్పేదేముందని అన్నారు. దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తనపైన వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గోస్తానని రేవంత్‌ను హెచ్చరించారు.