తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ముస్తాబాద్ సర్కిల్లోని జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ సేవలను మంత్రి హరీష్ రావు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. జయశంకర్ ఆశయాల సాధానకు చిత్తశుద్ధితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని మంత్రి హరీష్ రావు అన్నారు.