నేతన్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత బీమా కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమం అమలవుతుందన్నారు. దీని ద్వారా కరోనా కాలంలో 26 వేల కుటుంబాలకు 110 కోట్లు ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు.సిరిసిల్ల అపరెల్ పార్కులో గోకల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ
కేసీఆర్ నాయకత్వంలో మరమగ్గాలు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. మరమగ్గాల ఆధునీకరణకు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టడం జరిగింది అని కేటీఆర్ చెప్పారు. పెద్దూర్‌లోనే 88 ఎకరాల్లో రూ. 400 కోట్లు ఖర్చు పెట్టి వర్కర్ టూ ఓనర్ అనే ప్రోగ్రామ్‌కు పనులు జరుగుతున్నాయని తెలిపారు.
భారతదేశంలో నేతన్నల సంక్షేమం కోసం ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా జరగడం లేదన్నారు. పెద్దూర్ అపరెల్ పార్కులో మంచి వాతావరణాన్ని సృష్టించి.. మహిళలకు అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.