దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం పదిరోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్ కర్ణన్ కు ఆదేశమిచ్చారు. హుజూరాబాద్ నియోజక వర్గ దళిత ప్రజల డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ సమస్యలన్నీ గుర్తించి, వారిని కలెక్టర్ ఆఫీస్ కు పిలిపించుకొని పరిష్కరించాలని చెప్పారు.
రేషన్ కార్డులు, పింఛన్లు సహా అన్ని రకాల సమస్యలను, హుజూరాబాద్ నియోజక వర్గ దళిత వాడల్లో గుర్తించి అధికారులకు నివేదిక అందజేయాలన్నారు. హుజూరాబాద్ లోని ప్రతీ దళిత వాడల్లో వివిధ వ్యాధులతో బాధ పడుతున్న వారిని గుర్తించాలని సీఎం అన్నారు. నివేదిక తయారు చేసి అధికారులకు అందజేస్తే వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్య సాయం అందిస్తుందని చెప్పారు.
హుజూరాబాద్ లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దు. వందశాతం పూర్తి కావాలి. హుజూరాబాద్ లో ఖాళీ జాగాలు వున్న వారికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తది. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అమలు చేస్తాం. తెలంగాణలో అన్ని పథకాలను చూసి నేర్చుకున్నట్టే, దళిత బంధు పథకాన్ని చూసి కూడా ఇతర రాష్ట్రాలు నేర్చుకునే విధంగా పని చేయాలి అని సీఎం అన్నారు