దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రారంభించనున్న దళితబంధు పథకంపై తొలి అవగాహన సదస్సు ఈ నెల 26న ప్రగతిభవన్‌లో జరుగనున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేయనున్నారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) కలిపి 412 మంది దళిత పురుషులు, మహిళలు పాల్గొంటారు.
వారితోపాటు 15 మంది రిసోర్స్ పర్సన్స్ కూడా సమావేశానికి హజరవుతారు. వీరంతా 26న వారివారి గ్రామాల నుంచి మండల కేంద్రాలకు ఉదయం ఏడు గంటలలోపు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ అల్పాహారం తీసుకొని ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి వస్తారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.