తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చిన వైఎస్ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్‌లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేత తకళ్లపల్లి సత్యనారాయణరావుతో పాటు జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.సదాశివపేటలో నిర్వహించిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నాడు తెలంగాణకు వంద కోట్ల మంది ఒప్పుకోవాలని, తాను బతికుండగా తెలంగాణ రాదని వైఎస్ వెటకారాలు చేశారని, అలాంటివారి వారసులను ఎందుకు ఆశీర్వదించాలని ప్రశ్నించారు. ‘మా నీళ్లు దోచుకున్నందుకా? మా నిధులు ఆంధ్రాకు మళ్లించినందుకా? తెలంగాణను అవహేళన చేసినందుకా?’ అని నిలదీశారు.
త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను అవమానపర్చి, అవహేళన చేసి, తెలంగాణ రాకుండా అడ్డుకున్న వ్యక్తులకు ఇంకా తాము వారసులం అంటూ వచ్చేవారిని ఈ గడ్డ సహించబోదని హెచ్చరించారు. యువకులు, విద్యార్థులు, జయశంకర్‌సార్ సాగించిన పోరాటాలు, కేసీఆర్ 11రోజులపాటు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కారణంగా తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో సీఎం కేసీఆర్‌కు తప్ప మరెవ్వరికీ స్థానం లేదని స్పష్టంచేశారు.