ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మరో వరల్డ్ రికార్డు సృష్టించింది. సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌తో ఆమె ఈ రికార్డును అందుకుంది. మిథాలీ క్రికెట్లో అడుగుపెట్టి 22 ఏళ్లు అవుతోంది. మహిళల క్రికెట్లో ఇంత సుదీర్ఘ కెరీర్ మరెవరికీ లేదు.
కనీసం మిథాలీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం విశేషం. మెన్స్ క్రికెట్లోనూ ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే 22 ఏళ్లకుపైగా ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగాడు. అతని వన్డే కెరీర్ 22 ఏళ్ల 91 రోజులు సాగింది. ఈ సమయంలో 463 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతం ఇండ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్న మిథాలీ.. ఇంటర్నేషనల్ క్రికెట్లో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది.
తొలి వన్డేలో ఇండియన్ టీమ్ ఓడినా.. మిథాలీ ఈ రికార్డు అందుకోవడం ఓ విశేషమైతే.. షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేయడం మరో విశేషం. 17 ఏళ్ల వయసులోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన తొలి మహిళా క్రికెటర్ షెఫాలీనే.
ఇక మిథాలీ విషయానికి వస్తే ఈ హైదరాబాదీ 1999, జూన్ 26న అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. మిథాలీ వన్డే కెరీర్ ఇప్పుడు 22 ఏళ్ల 91 రోజులు దాటింది. కెరీర్లో ఆమె మొత్తం 215 వన్డేలు ఆడింది. వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా మిథాలీ పేరిటే ఉంది. 7170 పరుగులతో టాప్‌లో ఉన్న మిథాలీ కెరీర్లో 7 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.