దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పురోగతి బాట పట్టించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అసలైన గౌరవమిచ్చింది సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమనని అటవీ, పర్యావరణ, న్యాయదేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారత దేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన పీవీ చిరకీర్తిని పొందారని ఆయన చేసిన సేవలను కొనియాడారు.
పీవీ శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్… పీవీ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం తరఫున ఏడాది పొడవునా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. పీవీ నరసింహారావు ఈ దేశం కోసం ఎంతో చేసినా, ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మరచిపోయిందని తెలిపారు. కానీ పీవీ నరసింహారావు గారి కూతురు వాణిదేవికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఎమ్మేల్సిగా గెలిపించుకున్నామని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ కు పీవి జ్ఞాన మార్గ్ గా సీఎం కేసీఆర్ పేరు పెట్టారని, 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పీవీతో తనకున్న అనుబంధాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. 1991నుంచి పీవీతో పరిచయం ఉందని, ఎంపీగా ఉన్న సమయంలో తాను టీడీపీకి రాజీనామ చేసి మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వానికి మద్ధతునిచ్చానన్నారు. ఆయనను చాలాసార్లు కలిసే అవకాశం లభించిందని వెల్లడించారు. పార్లమెంట్ గ్రామీణాభివృద్ధిస్థాయి సంఘంలో తనను సభ్యునిగా నియమించారని, గ్రామీణాభివృద్ధిపై ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దొరికిందన్నారు. పీవీ ఆశయాలు, అలోచనలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.