తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటానుంచి చుక్కనీటినీ వదులుకోమని విద్యుత్తుశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి ఎన్ని ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ఎన్ భాస్కర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే కేంద్రం ఆ రాష్ర్ట సీఎం జగన్‌కు లోపాయికారిగా సహకరిస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడంలో చంద్రబాబు ఒక్కఅడుగేస్తే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంద అడుగులేసి నీటిదొంగగా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తండ్రిదారిలోనే నడుస్తూ జగన్మోహన్రెడ్డి నీటి గజదొంగగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.