తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్లోని ఫతుల్లాగూడలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను నిర్మించారు. రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం చేస్తారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణాల్లో కూడా నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు టోల్ ఫ్రీ నంబర్ 18001201159. ఇప్పటికే జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను నిర్మించామని గుర్తు చేశారు.
జీడిమెట్ల ప్లాంట్లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం జరుగుతుందన్నారు. ఇవాళ ప్రారంభించిన ఫతుల్లాగూడ ప్లాంట్లో కూడా రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్లో 2 వేల టన్నుల వ్యర్థాల పునర్వినియోగం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు