నూతన రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణ అంశాలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టరేట్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఎంలు, డిఎస్వోలతో విడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పౌరసరఫరాల కార్యాలయం నుండి కమిషనర్ అనిల్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీపై కాబినెట్ సబ్ కమిటీ సూచించిన విదంగా పెండిగ్లో ఉన్న అప్లికేషన్లను త్వరితగతిన వెరిఫికేషన్ చేసి స్పష్టమైన నివేదికను వారం రోజుల్లో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పాన్ని అధికారులకు వివరించారు గంగుల.
ఇప్పటికే ఎన్ఐసి, ఐటి డిపార్ట్మెంట్ వెరిఫికేషన్లో మిగిలిన 4,15,901 కార్డులకు సంబందించి 11,67,827 మంది లబ్దీదారుల వివరాలను గ్రౌండ్ లెవల్ తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. అత్యధికంగా దరఖాస్తులు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మున్సిపల్ శాఖ, జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని ప్రత్యేక శ్రద్ద తీసుకొని ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అప్లికేషన్లు చేసుకున్న తర్వాత నివాసం ఖాళీ చేసి వెల్లిపోయిన అద్దెదారుల వివరాలను సైతం సేకరించి అర్హులను గుర్తించి రేషన్ కార్డు అందించే విదంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మెత్తం ప్రక్రియ పారదర్శకంగా అర్హులైన లబ్దీదారులకు మేలు జరిగే విదంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డులకు త్వరలోనే స్మార్ట్ కార్డును జారీచేయాలని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి అధికారులకు తెలియజేశారు. రేషన్ డీలర్ల ఇతర సమస్యలు, నూతన రేషన్ షాపుల ఏర్పాటు గురించి మంత్రి గంగుల అధికారులతో చర్చించారు.
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డులను స్రుష్టించిందని, దేశంలోనే అత్యదికంగా ఈ యాసంగిలో 90కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించి మన రికార్డును మనమే తిరగరాసామన్నారు మంత్రి గంగుల కమలాకర్. దేశంలో మద్దతు ధరతో ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఇప్పటికే 17వేల కోట్లకు పైగా విలువ గల దాన్యాన్ని సేకరించడమే కాక కేవలం మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఇంటర్మీడియట్ గోదాంలను వినియోగిస్తున్నామన్నారు. కరోనా లాంటి సంక్లిష్ట సమయంలోనూ కూలీల కొరత, మిల్లింగ్ కొరత, ట్రాన్స్ పోర్టు వాహనాల కొరత, అకాలవర్షాల వంటి ఇబ్బందుల్ని అధిగమించి రికార్డు స్థాయి ధాన్యం సేకరించడంలో సహకరించిన కలెక్టర్లు, అధనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సహకార సొసైటీలకు, మహిళా సంఘాలకు, కూలీలు, హమాలీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం కోసం అన్నిరకాల చర్యలు తీసుకుందని, 4,97,389 అప్లికేషన్లను వివిద దశల వెరిఫికేషన్ ద్వారా నిర్దారించిన దరఖాస్తులను జిల్లాల వారీగా పంపించామని, వివిద శాఖల్ని సమన్వయం చేసుకొని అతి త్వరలో అర్హులైన లబ్దీదారుల జాబితాలను పంపించాల్సిందిగా కలెక్టర్లకు, పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ప్రోక్యూర్మెంట్ విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను అభినందిస్తూ మిల్లింగ్ ప్రక్రియలోనూ అదే ఉత్సాహాన్ని చూపాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల నుండి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.