తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ పూర్తి అయినట్లు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వానాకాలం, యాసంగిలో కలిపి కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు.
ఒక్క యాసంగి సీజన్‌లోనే 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగినట్లు తెలిపారు. మరో 50 వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ముగిసినట్లు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు 63 నుంచి 114 శాతం పెరిగాయన్నారు.
మొత్తం 15 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేసినట్లు వివరించారు. మొత్తం ధాన్యం సేకరణ విలువ రూ.17 వేల కోట్లు కాగా ఇప్పటికే రూ.14 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
నిన్న, ఇవాళ రూ.2 వేల కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం ముఖచిత్రమే మారిందన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర చెల్లింపులో రాష్ట్రం ముందుందన్నారు. పౌర సరఫరాల సంస్థ రికార్డులు సృష్టించిందని… సహకరించిన నాయకులకు, అధికారులకు పేరు పేరునా ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.