సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహం పెట్టాలనే తమ కలను ప్రభుత్వం సాకారం చేసిందని సంతోష్‌బాబు సతీమణి సంతోషి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్‌బాబు సతీమణి పాల్గొని మాట్లాడారు.
సంతోష్‌బాబు మరణంతో తమ కుటుంబం కుంగిపోయిందన్నారు. పెద్దదిక్కు కోల్పోయిన తమ కుటుంబానికి ప్రభుత్వం ఎంతో చేయూతనిచ్చిందని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అమర సైనికుడి కుటుంబానికి సీఎం కేసీఆర్ సాయం చేశారన్నారు.
ప్రాణాలు తేలేం కానీ, మీకు అండగా నిలుస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రూ.5 కోట్ల సాయం చేసి, ఇంటిస్థలం ఇచ్చి, గ్రూప్ వన్ కేడర్‌లో ఉద్యోగం ఇచ్చారన్నారు. తమ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ తన ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టిన ఆ రోజుని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. తనను కన్న కూతురిలా చూసుకుని ఓదార్చి సీఎం ధైర్యం చెప్పారన్నారు