తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 28 వేలకుపైగా నీటివనరుల్లో రూ.89 కోట్లతో 93 కోట్ల చేపపిల్లలు, రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలు వేయనున్నట్టు తెలిపారు.
చేపపిల్లల పంపిణీపై మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. మత్య్ససంపద పెంచడంతోపాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్ చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. టెండరు సమయంలో చెరువులను సందర్శించి చేపపిల్లల నాణ్యతను పరిశీలించాలని సూచించారు.
పెరుగుతున్న మత్య్ససంపదకు అనుగుణంగా మార్కెటింగ్ అవకాశాలను కూడా పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇందులోభాగంగానే జీహెచ్ఎంసీలో 100 మొబైల్‌ఫిష్ అవుట్‌లెట్స్‌ను ప్రారంభించామని తెలిపారు.