• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి
• దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి
• తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక
• ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత
• ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం
దేశంలో తొలిసారిగా భారీ సంఖ్యలో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రభుత్వ అవసరాలకోసం ఉచితంగా అందేంచేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఒక్క క్రయోజనిక్ ట్యాంకర్ తీసుకురావడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 11 ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన సేకరించి హైదరాబాద్ కు తీసుకువస్తోంది. ఇంతవరకు ఏ రాష్ర్టంలోనూ ఎవరూ కూడా చేయని విధంగా ఇంతస్థాయిలో క్రయోజనిక్ ట్యాంకర్లను ఆపద సమయంలో ఆదుకునే విధంగా మొదటిసారిగా దిగుమతి చేస్తోంది. ఆర్మీ ప్రత్యేక విమానం ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో తొలివిడతగా శనివారం (22.05.2020) సాయంత్రం 3 క్రయోజనిక్ ట్యాంకులను తీసుకువచ్చింది. ఈ విమానాలు బేగంపేటలోని ఏయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల విమానాలు అక్కడ దిగేందుకు ప్రత్యేకంగా అనుమతిచ్చాయి. మిగతా 8 క్రయోజనిక్ ట్యాంకులు మరో రెండు – మూడు రోజుల్లో రానున్నాయి. ఈ 11 ట్యాంకర్లను తెలంగాణ ప్రభుత్వ అవసరాల కోసం అందించనుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సమన్వయంతో పూర్తి సహకారాన్ని అందించడం ద్వారా త్వరితగతిన అంటే అనుకున్న సమయం కంటే ముందుగానే తీసుకువచ్చేందుకు వీలవుతోంది.
ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు ద్రిష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ సప్లపై క్రయోజనిక్ ట్యాంకర్స్ ను దేశంలోనే మొదటిసారిగా బ్యాంకాక్ నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ ను సరఫరాచేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా లాంటి సదుపాయాలు లేకపోవడంతో అవసరమైన వారికి అందడం లేదు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గాలించిన తరువాత బ్యాంకాక్ నుంచి 11 క్రయోజనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. ఒక్కొక్క ట్యాంకు నుంచి దాదాపు 1 కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ అందించడం వీలవుతుంది. ఆ విధంగా 11 ట్యాంకర్ల నుంచి ఒకేసారి 15 కోట్ల 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయడం సాధ్యమవుతుందిన ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్ రెడ్డి తెలిపారు. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను రాష్ర్ట ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. ఇతర రాష్ర్టలలోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు అందచేస్తాయి. అదే సమయంలో అవసరాన్ని బట్టి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా కూడా వీటిని ఉపయోగిస్తారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్ రావు తో పాటు రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా యాజమాన్యం కృషి చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది.
కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. అలాగే ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంఈఐఎల్ థాయిలాండ్ (బ్యాంకాక్) నుంచి 11 క్రయోజనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకొని దేశీయ అవసరాల కోసం తమ వంతు విధిగా దిగుమతి చేసుకున్నామన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు.
దేశంలో వైద్య సేవల అసరాలకు తగిన విధంగా ఆక్సిజన్ (LMO) ఉత్పత్తి ఉంది. అయితే ఉత్పత్తి ప్లాంట్ల నుంచి ఆసుపత్రులకు రవాణా చేయడానికి అవసరమైన క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో లేవు. వీటిని అప్పటికప్పుడు తయారు చేయడం కూడా సాధ్యం కాదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా అంత సులభం కాదు. మేఘా ఇంజనీరింగ్ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటిని దిగుమతి చేసుకుంటోంది. పూర్తి ఖర్చును సంస్థనే భరిస్తోంది.
మూడు కోట్ల లీటర్ల ఆక్సిజన్ సరఫరా
అలాగే బొల్లారంలో గల ఎంఈఐఎల్ ప్లాంట్ లో ఆక్సిజన్ 24X7 ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ర్టాలలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ప్రైవేటు అయినా, గవర్నమెంట్ అయినా ఆసుపత్రులలో ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్, ఐసియూ బెడ్స్ ఉంటే వాళ్లు ఖాళీ సిలిండర్లు తీసుకొస్తే వాటిలో ఉచితంగా ఆక్సిజన్ నింపి సరఫరా చేస్తున్నారు. ఇది పూర్తిగా కోవిడ్ రోగుల చికిత్సా అవసరాలకోసం మాత్రమే అందిస్తున్నారు. ఒక్కొక్క సిలిండర్ సామర్థ్యం 7000 లీటర్లు కాగా రోజుకు సరాసరిన కనీసం 10 ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. రోజుకు సరాసరిన 400 సిలిండర్లను ఎంఈఐఎల్ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు అంటే 9 మే నుంచి 21 వరకు 29,694 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఎంఈఐఎల్ సరఫరా చేసింది. అంటే 2 కోట్ల 97 లక్షల లీటర్లు పంపిణీ చేశారు. మొత్తం 4242 సిలిండర్లు వివిధ ఆసుపత్రులకు అందించారు. ఇందుకోసం ఎంఈఐఎల్ ప్రత్యేకంగా ఒక బందాన్ని ఏర్పాటు చేసింది. వీళ్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు.