భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి?
తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది.
వెంటనే నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ పెరిగి ఛాతీలో నొప్పి, పోషకాలు శరీరానికి చేరకపోవడం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి.
నీళ్లు శరీర ఉష్ణోగ్రతల మీద కూడా ప్రభావం చూపుతాయి. కొవ్వు పేరుకునేందుకు, ఇన్సులిన్ సమతౌల్యం దెబ్బతినేందుకు కారణమవుతాయి.
ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తపోటు, గుండె సమస్యల ప్రమాదం అధికం అవుతుంది.
.. చెబుతూపోతే ఎన్నో సమస్యలు. యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, ట్రైగ్లిజరైడ్స్ అదుపు తప్పడం లాంటివి వాటిలో ప్రధానమైనవి. అందుకే ఆహారం తీసుకున్నాక అరగంట అయినా ఓపిక పట్టమంటున్నారు నిపుణులు.