ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన మంత్రి, విప్ సహా 12 మంది గిరిజన ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించుకోవాలని రాష్ట్ర గిరిజన ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన, హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సత్కరించడానికి ఏర్పాట్లు చేశాయి. ఈ సత్కార సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానుండగా, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యేలు అందరికీ వారు సన్మానం చేయనున్నారు.
కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క, సీతక్క ములుగు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే ప్రభుత్వ విప్ డోర్నకల్ నుండి గెలుపొందిన డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సన్మానము పొందనున్నారు.
అలాగే సన్మానం పొందనున్న మిగతా ఎమ్మెల్యేలలో ఆసిఫాబాద్ నుండి గెలుపొందిన కోవా లక్ష్మి, ఖానాపూర్ నుండి గెలుపొందిన ఎడ్మ బొజ్జ, బోథ్ నుండి గెలుపొందిన అనిల్ జాదవ్, దేవరకొండ నుండి గెలిచిన నేనావత్ బాలు నాయక్, మహబూబాబాద్ నుంచి గెలిచిన డాక్టర్ భూక్య మురళి నాయక్, పినపాక నుండి గెలిచిన పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు నుండి గెలిచిన కోరం కనకయ్య, వైరా నుండి గెలిచిన మాలోత్ రాందాస్, అశ్వరావుపేట నుంచి గెలుపొందిన జానే ఆదినారాయణ, భద్రాచలం నుంచి గెలిచిన డాక్టర్ తెల్లం వెంకట్రావు ఉన్నారు