సాయిపల్లవి చుట్టూ ఉండే ఆరా కళ్లు తిప్పుకోనివ్వదు. మనసుల్ని కట్టిపడేసే తెలీని ఆకర్షణ ఆమె సొంతం. నిజానికి సాయిపల్లవికి ఉన్నంత క్రేజ్ దక్షిణాదిన ఏ హీరోయిన్‌కీ లేదు. తన ప్లేస్‌లో వేరెవరైనా ఉంటే.. దీపం ఉంది కదా అని ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉండేవాళ్లు. కానీ సాయిపల్లవి అలా కాదు. కథ నచ్చాలి.
పాత్ర అభినయానికి ఆస్కారమున్నది కావాలి. అప్పుడే చేయటానికి ఓకే చెబుతుంది. అందుకే హీరోయినై తొమ్మిదేళ్లవుతున్నా తక్కువ సినిమాల్లోనే నటించింది. ఇటీవల ఓ ఇంటర్‌వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది సాయిపల్లవి.‘ ఎంబీబీఎస్ ఇష్టంతోనే చదివాను. యాక్టర్‌ని కూడా ఇష్టంతోనే అయ్యాను. డాన్స్ కూడా ఇష్టంతోనే నేర్చుకున్నాను.
ఇష్టంలేకుండా నా జీవితంలో ఏదీ జరగలేదు. ఇక ఈ క్రేజ్ అంటారా.. అది గాడ్ గిఫ్ట్. ‘ప్రేమమ్’ వచ్చేదాకా నటించగలనని నాకే తెలీదు. ఇంట్లోవాళ్లు కూడా షాక్. ‘జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని’ అని డాడీ చెప్పారు. ‘కాకపోతే ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. గౌరవంగా ఉండాలి. గౌరవంగానే బతకాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలి..’ ‘ప్రేమమ్’కి సైన్ చేస్తున్నప్పుడు నాన్న నాకు చెప్పిన నీతి. ఆ మాటలు జీవితంలో మరిచిపోను.’ అంటూ అందంగా నవ్వుతూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.