తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన శాసన మండలి చైర్మన్ పదవీలో ఉన్నానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. చట్టబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం ఉందని తెలిపారు.