తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, 50 శాతం ఉన్న బీసీలు బీజేపీకి ఓటు వేయకపోతే వారిని ఇతర పార్టీలూ నమ్మవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు.
‘మీ కోసం కొట్లాడి జైలుకు పోయినోళ్లను గెలిపిస్తారా… భూకబ్జా, చీటింగ్, అక్రమ సంపాదన కేసులు, రౌడీషీట్లు ఉన్న వాళ్లను గెలిపిస్తారా?’ అని ప్రజలను అడిగారు. ప్రజల కోసం పోరాడినందుకు దాదాపు 5 వేల మంది బీజేపీ కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని, తనపై 74 కేసులు పెట్టారన్నారు. కానీ బీఆర్‌ఎస్ నాయకులపై భూకబ్జా కేసులు ఉన్నాయన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై 27 కేసులున్నాయని, అవన్నీ 420 కేసులని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌పై అక్రమ సంపాదన, గ్రానైట్ కేసులు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోతే తాము పోరాడి అమలు చేయించామన్నారు. ‘యూజ్‌లెస్ ఫెలో… ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయించాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి. కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్. మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో’ అంటూ మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘మీ అయ్య ఉద్యోగాలిస్తానంటడు. నువ్వేమో నిరుద్యోగులను చెత్త నాకొడుకుల్లారా.. సన్నాసుల్లారా.. అని బూతులు తిడతావా? అని మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్ ముఖమే చూడలేకపోతున్నామని, ఇక కండకావరమెక్కిన కేటీఆర్‌ను ఎవరు చూస్తారన్నారు.