తెలంగాణ వచ్చాక గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వెబ్సైట్ ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంచ్ చేశారు.తాము ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కన్నా రెట్టింపుకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపిన కేటీఆర్, ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలతో కూడిన ఈ వెబ్సైట్ ను ప్రారంభించారు.
2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను 9.5 సంవత్సరాలలో గుర్తించి, లక్ష అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేసామని కేటీఆర్ తెలిపారు.జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.నిన్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతున్న యువకులతో సుదీర్ఘంగా చర్చించిన కేటీఆర్, వారి విజ్ఞప్తి మేరకు ప్రజలకు ముఖ్యంగా యువకులకు అందుబాటులో ఉండేలా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు.ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా పలు రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వలన యువత లో పలు అపోహలు నెలకొన్నాయని వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.
నిన్న జరిగిన చర్చ సందర్భంగా వారికి మంత్రి కేటీఆర్ ప్రభుత్వ అధికారిక లెక్కలతో కూడిన వివరాలను అందించారు. కేటీఆర్ అందించిన సమాచారం పట్ల సంతృప్తి మరియు ఆశ్చర్యం వ్యక్తం చేసిన వారు వీటన్నింటిని రాష్ట్ర యువతకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈరోజు ప్రారంభించిన ఈ వెబ్ సైట్ లో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం, విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిల్ ఏర్పాటు వంటి అంశాలపైన వివరాలు అందుబాటులో ఉంచారు.రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి, యువతి యువకులు ఈ వెబ్సైట్ ని సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కేటీఆర్ కోరారు.
telanganajobstats.in లో అన్నీ వివరాలు ఉంచినట్లు కేటీఆర్ తెలిపారు.