ధరణిని తీసేసి భూమాతను తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. అసలు అది భూమాతనా? లేక భూ’మేత’నా అని సీఎం కేసీఆర్ చురకలంటించారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే ధరణి పోతదని, మళ్లీ పాత రాత పుస్తకాలు ప్రత్యక్షమవుతాయని అన్నదాతలను హెచ్చరించారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అని మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని నిప్పులు చెరిగారు. ‘ఇందిరమ్మ రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, కరువు కాటకాలు, ఉపాసాలు తప్ప ఇందిరమ్మ రాజ్యంలో ఏముంది?’ అని నిలదీశారు. మళ్లా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని, ఉన్నది నాశనం చేయడానికే వస్తున్నారని మండిపడ్డారు.
సోమవారం మానకొండూర్, స్టేషన్‌ఘన్‌పూర్, నకిరేకల్, నల్లగొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని, ప్రసంగించారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధితోపాటు రాబోయే రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ఇవి ఎన్నికలు కావు.. తెలంగాణ బతుకు పోరాటమని, అనాలోచితంగా ఉంటే ఓటే కాటేస్తదని, దళారులు, పైరవీకారుల రాజ్యమే వస్తుందని హెచ్చరించారు.