అధికారం కోసం ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాటక ప్రజలు నరకం చూస్తున్నారన్నారు. పాత పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాతర వేస్తున్నదని, పిల్లలకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల్లో కూడా కోత పెట్టిందని విమర్శించారు.
అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తికతోపాటు పలువురు నేతలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. ఢిల్లీ నాయకులను నమ్మితే మోసపోతామని చెప్పారు. కర్ణాటకలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఆచూకీ లేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆ రాష్ట్రానికి వెళ్లలేదని చెప్పారు.