తెలంగాణలో వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
దున్నపోతు ఈనిందని ఒకరంటే, దుడ్డెను కట్టేయండని మరొకరు అంటారని ఎద్దేవాచేశారు. కండ్లముందు కనబడేది నిజం కాదట.. సోషల్ మీడియాలో కనిపించేది, ఢిల్లీ నుంచి వచ్చి చెప్పేవాళ్లది నిజమట అని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరాన్ని ఇంకా బద్నాం చేయడానికి ఇంకొకరు రిపోర్టులు తయారుచేస్తారన్నారు. తెలంగాణలో ఏదీ బాలేదని చెప్పడానికి ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆఫీసుల్లో వండివార్చిన వంటకాలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టేసేలా మోదీ, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తారని ఆరోపించారు.