కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించలేని కేంద్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న BJP ప్రభుత్వం రాష్ట్రంలో BC ముఖ్యమంత్రి ని చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం జూబ్లిహిల్స్ MLA అభ్యర్ధి మాగంటి గోపీనాథ్ కు మద్దతుగా బొరబండ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సీట్లు గెలిచిన పార్టీ ముఖ్యమంత్రి ని ఎలా చేస్తారని ప్రశ్నించారు. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే BJP, కల్లబొల్లి మాటల కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని, తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో KCR నాయకత్వంలో BRS ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి సాధించిందని, విశ్వనగరంగా రూపుదిద్దుకుందని తెలిపారు. IT రంగం, పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయని, వేలాది లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. అదేవిధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినట్లు చెప్పారు. దేశంలోనే ప్రముఖ నగరాల జాబితాలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా అమలు అవుతున్నాయని చెప్పారు.
జూబ్లిహిల్స్ నియోజకవర్గ పరిధిలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించినట్లు చెప్పారు. నూతన కాలనీలు, బస్తీలు ఏర్పడటం, జనాభా పెరగడం వలన పెరిగిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మళ్ళీ BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ తో పాటు 1050 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలెండర్ ను 400 రూపాయలకే ఇస్తామని ముఖ్యమంత్రి మేనిఫెస్టో లో ప్రకటించారని చెప్పారు. అదేవిధంగా 15 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. మహిళలకు సౌబాగ్యలక్ష్మి కార్యక్రమం క్రింద నెలకు 3 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించబడుతుందని చెప్పారు. ఇండ్లు లేని పేదల కోసం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి 70 వేల వరకు ఇండ్లను అర్హులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో లక్ష ఇండ్లను నిర్మిస్తామని అన్నారు. జూబ్లిహిల్స్ లో కూడా అనేకమంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చినట్లు వివరించారు. జూబ్లిహిల్స్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో తిరిగి ప్రజలు మాగంటి గోపీనాథ్ ను గెలిపిస్తారని, ఆయన గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. మంత్రి వెంట MLA అభ్యర్ధి మాగంటి గోపీనాథ్, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, ఖాదర్ బాబు, కృష్ణ మోహన్, రమేష్, ధర్మ, సురేందర్ యాదవ్, తదితరులు ఉన్నారు.